7న ట్రైలర్ చూపిస్తాం: కేంద్రానికి రైతుల హెచ్చరిక

న్యూఢిల్లీ: జనవరి 7వ తేదీన ఢిల్లీ సరిహద్దులో ట్రాక్టర్లతో మార్చ్ నిర్వహించి జనవరి 26 నాటి కార్యక్రమానికి సంబంధించిన ట్రైలర్ను కేంద్ర ప్రభుత్వానికి చూపిస్తామని రైతు సంఘాలు ప్రకటించాయి. వాస్తవానికి జనవరి 8వ తేదీన రైతులు-కేంద్రం మధ్య ఎనిమిదవ దశ చర్చలు ఉన్నాయి. దానికి ఒక్క రోజు ముందే రైతులు ఈ ట్రాక్టర్ ర్యాలీకి పిలుపునివ్వడం మరింత ఆసక్తికరంగా మారింది. జనవరి 26వ తేదీన ఢిల్లీలో ట్రాక్టర్ మార్చ్ చేపట్టాలని రైతు సంఘాలు నిర్ణయించాయి.
మంగళవారం ఢిల్లీ సరిహద్దులోని రైతుల నిరసన నుంచి స్వరాజ్ ఇండియా వ్యవస్థాపకులు యోగేంద్ర యాదవ్ మాట్లాడుతూ ”ఢిల్లీ సమీపంలోని నాలుగు సరిహద్దుల్లో (తూర్పు సరిహద్దు నుంచి పశ్చిమ సరిహద్దు వరకు) ట్రాక్టర్లతో పెద్ద ఎత్తున నిరసన చేపట్టబోతున్నాం. జనవరి 26న చేపట్టబోయే ట్రాక్టర్ల ర్యాలీకి ఇది ట్రైలర్ మాత్రమే. రేపటి నుంచి రెండు వారాల పాటు ‘దేశ్ జాగ్రన్ అభియాన్’ ప్రారంభమవుతుంది. అనంతరం దేశవ్యాప్తంగా నిరసనలు తీవ్రతరం అవుతాయి” అని యోగేంద్ర యాదవ్ అన్నారు.