మళ్లీ బ్యాట్ పట్టనున్న సచిన్, సెహ్వాగ్

Spread the love

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మాజీ క్రికెటర్లు ప్రత్యర్థులుగా బరిలో దిగి తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. మైదానంలో మళ్లీ బ్యాట్ పట్టి బౌలర్లపై విరుచుకుపడాలని బ్యాట్స్‌మెన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రోడ్ సేఫ్టీ వరల్డ్ టీ20 సిరీస్ రాయ్‌పూర్‌లోని షాహీద్‌ వీర్‌ నారాయణ్‌సింగ్‌ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో మార్చి 2 నుంచి 21 వరకు జరగనుంది. నాలుగు మ్యాచ్‌లు జరిగిన తర్వాత కరోనా కారణంగా గతేడాది సిరీస్‌ వాయిదా పడింది. మిగిలిన మ్యాచ్‌లన్నీ రాయ్‌పూర్‌లో కొత్తగా నిర్మించిన 65వేల సామర్థ్యం కలిగిన స్టేడియంలో జరుగుతాయి.

స్టార్‌ క్రికెటర్లు మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, బ్రియాన్‌ లారా, బ్రెట్‌లీ, తిలకరత్నె దిల్షాన్‌, ముత్తయ్య మురళీధరన్‌తో పాటు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్‌, ఆతిథ్య భారత్‌కు చెందిన పలువురు ప్రముఖ క్రికెటర్లు సిరీస్‌లో పాల్గొనబోతున్నారు. దేశంలో రహదారి భద్రతపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన టీ20 క్రికెట్‌ టోర్నమెంట్‌లో తమ మునుపటి ఆటను ప్రదర్శించేందుకు వీరంతా సన్నద్ధమవుతున్నారు. దేశంలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకొని టోర్నీ ద్వారా రోడ్‌సేఫ్టీపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సిరీస్‌ ఏర్పాటు చేశారు. లిటిల్‌ మాస్టర్‌ సునీల్‌ గావస్కర్‌ సిరీస్‌కు కమిషనర్‌గా వ్యవహరిస్తుండగా సచిన్‌ లీగ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా కొనసాగుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *