కసి.. నిలకడ.. కనిపించలేదు: కోహ్లీ

Spread the love

చెన్నై: తమ దేహభాష, ఆటలో స్థాయికి తగిన తీవ్రత కనిపించలేదని టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ అన్నాడు. ఇంగ్లాండ్‌తో తొలి టెస్టులో కొన్ని పొరపాట్లు చేశామని అంగీకరించాడు. మరింత ప్రొఫెషనల్‌, నిలకడగా ఆడాల్సిందని పేర్కొన్నాడు. 420 పరుగుల లక్ష్య ఛేదనలో 227 పరుగుల తేడాతో ఓటమి పాలైన తర్వాత అతడు మాట్లాడాడు.

‘అవును, మా దేహభాష, తీవ్రత స్థాయికి తగ్గట్టు లేవు. రెండో ఇన్నింగ్స్‌లో మేం మరింత మెరుగ్గా ఉన్నాం. బ్యాటింగ్‌లో తొలి ఇన్నింగ్స్‌ రెండో అర్ధభాగంలోనూ మెరుగ్గానే ఉన్నాం. మేం ఎక్కడ బాగున్నామో ఎక్కడ బాగాలేమో అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మేమెప్పుడూ మెరుగవ్వాలనే కోరుకుంటాం. ఈ మ్యాచులో ఇంగ్లాండ్‌ మా కన్నా మెరుగ్గా, నిలకడగా ఆడింది’ అని విరాట్‌ అన్నాడు.

‘తొలి ఇన్నింగ్స్‌లో ఫాస్ట్‌ బౌలర్లు, యాష్‌ సమష్టిగా బౌలింగ్‌ చేశారు. అయితే పరుగుల్ని నియంత్రించి ఒత్తిడి పెంచాల్సింది. పిచ్‌ మందకొడిగా ఉండి బౌలర్లకు సాయపడకపోవడంతో బ్యాట్స్‌మెన్‌ సులభంగా స్ట్రైక్‌ రొటేట్‌ చేశారు. వాషింగ్టన్‌, నదీమ్‌ ఎక్కువ పరుగులు ఇచ్చారనడం సబబే. ప్రణాళికల అమల్లో లోపాలు ఆమోదయోగ్యమే కానీ వైఖరి సరిగ్గా ఉందా లేదా అన్నదే అత్యంత కీలకం’ అని కోహ్లీ పేర్కొన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *