కొనసాగుతున్న బండి సంజయ్‌ దీక్ష

Spread the love

 

కరీంనగర్‌: దుబ్బాక వెళ్తున్న తనపై సిద్దిపేట పోలీసు కమిషనర్‌ దౌర్జన్యం చేసి చేయి చేసుకున్నారని, ఆయన్ని బదిలీ చేయాలని డిమాండ్‌ చేస్తూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ చేపట్టిన దీక్ష కొనసాగుతోంది. సీపీని బదిలీ చేసి కేసు నమోదు చేసేవరకు తన కార్యాలయంలోనే దీక్షలో ఉంటానని సంజయ్‌ ప్రకటించారు. బయటి నుంచి తాళం వేసుకుని రాత్రి నుంచి కార్యాలయంలోనే నిర్బంధ దీక్ష కొనసాగిస్తున్నారు.

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా తనకు దుబ్బాక వెళ్లేందుకు ఎన్నికల కమిషన్‌ అనుమతితో కూడిన పాస్‌ ఉన్నా అమర్యాదగా, దురుసుగా వ్యవహరించారన్నారు. ఎన్నికల కమిషన్‌ కలెక్టరును బదిలీ చేసి చేతులు దులిపేసుకుందని.. పోలీసు కమిషనర్‌ను మాత్రం బదిలీ చేయలేదన్నారు. తనపై దురుసుగా ప్రవర్తించిన కమిషనర్‌పై పార్లమెంటులో ఫిర్యాదు చేస్తానని, సస్పెండ్‌ చేసేవరకు పార్టీ శ్రేణులు ఆందోళనలు చేపడతాయన్నారు. దుబ్బాకలో తెరాస గెలవకపోతే సస్పెండ్‌ చేస్తాం, బదిలీ చేస్తామని అధికార పార్టీ నేతలు స్థానిక అధికారులను బెదిరిస్తున్నారని బండి సంజయ్‌ ఆరోపించారు. ఏదోరకంగా శాంతి భద్రతల సమస్య సృష్టించి దుబ్బాక ఉప ఎన్నికను వాయిదా వేయాలని తెరాస కుట్రపన్నుతోందన్నారు. అందులో భాగంగానే నిన్న సిద్దిపేట ఘటన అని పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో దుబ్బాక ఎన్నిక నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. తెరాస కండువా వేసుకున్న కార్యకర్త మాదిరిగా సిద్దిపేట సీపీ వ్యవహరిస్తున్నారని సంజయ్‌ ఆరోపించారు. ఎంపీ దీక్ష నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.
మద్దతు తెలిపిన భాజపా నేతలు…
రాష్ట్ర స్థాయి భాజపా నాయకులు కరీంనగర్‌కు తరలివచ్చి సంజయ్‌ దీక్షకు మద్దతు తెలుపుతున్నారు. భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, భాజపా రాష్ట్ర ప్రధానకార్యదర్శి బంగారు శ్రుతి, మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్‌, తదితరులు బండి సంజయ్‌ని పరామర్శించి మద్దతు తెలిపారు. ఉమ్మడి కరీనంగర్‌ జిల్లా వ్యాప్తంగా పార్టీ ముఖ్యనాయకులు, కార్యకర్తలు ఎంపీ కార్యాలయం వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. బండి సంజయ్‌ దీక్షకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా భాజపా శ్రేణులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. మరోవైపు పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *